రెడ్ మెర్క్యురీ: పాత టీవీలు, రేడియోలకు లక్షలు ఇస్తామంటున్నారు… ఏమిటీ బేరం


ఐదారు దశాబ్దాల కిందటి టీవీలు, రేడియోలు, ఫోన్లు, కెమెరాలు, కుట్టు మిషన్లకు ఇప్పుడు అమాంతం డిమాండ్ పెరిగిపోయింది.

వాటి కోసం తెలుగు రాష్ట్రాల్లోని పల్లెలు, పట్టణాలను జల్లెడ పట్టేస్తున్నాయి కొన్ని ముఠాలు. రూ. లక్షలు ఇచ్చి కొనడానికి రెడీ అవుతున్నాయి.

‘రెడ్ మెర్క్యురీ’ అనే విలువైన మూలకం వాటిల్లో ఉందన్న ప్రచారమే దీనికి కారణం.

పాత టీవీలకు, రేడియోలకు రూ.10 లక్షలు
స్టోర్ రూముల్లోకి, అటకల మీదకు ఎప్పుడో చేరిపోయిన పాత టీవీలు, రేడియోల ధర ఇప్పుడు లక్షలు పలుకుతోందంటే ఆశ్చర్యంగానే ఉంటుంది.

1960, 1970ల నాటి రేడియో, టీవీ, ల్యాండ్‌లైన్ ఫోన్లు, కెమెరాలు, కుట్టు మిషన్ల తయారీలో రెడ్ మెర్క్యురీని ఉపయోగించేవారని…. అణ్వాయుధాల తయారీకి అది అవసరమవుతోందని అయిదారు నెలలుగా తెలుగు రాష్ట్రాల్లో ప్రచారం జోరుగా సాగుతోంది. దీంతో రెడ్ మెర్క్యురీ అనే పదం జనాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

ఈ పాత వస్తువులను కొందరు ఈ-కామర్స్ ప్లాట్ ఫాంలలో నేరుగానే అమ్మకానికి పెడుతున్నారు. వీటి ధర అమ్మకం, కొనుగోళ్లు పరంగా రూ.లక్ష నుంచి రూ.పది లక్షల వరకు పలుకుతోంది.

పాత టీవీలు, రేడియోలు ఉంటే మాకు అమ్మండి రూ.పది లక్షలిస్తామంటూ కొనేవాళ్లు ఈ-కామర్స్ ప్లాట్ ఫాంలలో ఆఫర్స్ పెడుతున్నారు.

మరికొందరు పాతవస్తువులను కొనే వ్యాపారులుగా మారి వీటి కోసం వేట సాగిస్తున్నారు.

ఇంకొందరైతే అణు బాంబుల తయారీలో ఉపయోగపడే ఈ రెడ్ మెర్క్యురీకి కోట్లలో విలువ ఉందనీ… వాటిని కొనేందుకు కొన్ని ఏజెన్సీలు సిద్ధంగా ఉన్నాయంటూ దందాలు సాగిస్తున్నారు.

ది ఎండ్ ఆఫ్ ఎవ్రీథింగ్: ఈ అనంత విశ్వం ఏదో ఒక రోజు అంతం కాక తప్పదా…
అమ్మోనియం నైట్రేట్ అంటే ఏమిటి.. అది ఎంత ప్రమాదకరం

రెడ్ మెర్క్యురీ సంబంధించిన విషయాలను కెమిస్ట్రీ ప్రొఫెసర్‌గా 35 ఏళ్ల అనుభవం ఉన్న ఏయూ మాజీ వీసీ కె. నాగేశ్వరరావు బీబీసీకి వివరించారు.

“మెర్క్యురీ అత్యంత అరుదైన, విశిష్టమైన మూలకం. తెలుగులో పాదరసం అని పిలుస్తాం. సిన్నాబార్ అనే ఖనిజ ధాతువు నుంచి కేజీకి కేవలం 0.05 మిల్లీ గ్రాముల పాదరసం మాత్రమే లభిస్తుంది. ఆమ్లాలతో చర్య పొందకపోవడంతో పాటుగా గది ఉష్ణోగ్రత వద్ద ద్రవరూపంలో ఉండే ఏకైన లోహం మెర్క్యురీయే. అందుకే దీనికి అంత డిమాండ్.

నిత్యజీవితంలో ఉపయోగించే వివిధ వస్తువుల తయారీలో దీన్ని వాడతారు. శరీర ఉష్ణోగ్రతను చూపే థర్మా మీటర్, వాతావరణ పీడనాన్ని కొలిచే బారో మీటర్లతో పాటు ఫ్లోరోసెంట్ దీపాల తయారీలోనూ పాదరసం వినియోగిస్తారు. కిలో మెర్క్యురీ ధర మూడు వేల రూపాయల వరకూ ఉంటుంది. కానీ, ఇప్పుడు ప్రచారం జరుగుతున్న ఈ రెడ్ మెర్క్యురీ అనేది ప్రత్యేకంగా లేదు.

మెర్క్యురీ సల్ఫైడ్ అనే సమ్మేళనం ఎరుపు రంగులో ఉండటంతో దాన్ని రెడ్ మెర్క్యురీగా వ్యవహరిస్తారే తప్ప నిజంగా ఇలాంటి మూలకం లేదు” అని నాగేశ్వరరావు చెప్పారు.

పాత టీవీలు, రేడియోల్లో దీన్ని ఉపయోగించారా?
ఎలక్ట్రానిక్ వస్తువులు రిపేర్లు చేయడంలో 25 ఏళ్లకు పైగా అనుభవం ఉన్న రాజేశ్ బీబీసీతో మాట్లాడుతూ… “కొన్ని దశాబ్దాల కిందట వినియోగించిన సీఆర్టీ (క్యాథోడ్ రే- ట్యూబ్) మోడల్ టెలివిజన్, యాంటిక్ రేడియోల్లో రెడ్ మెర్క్యురీగా పిలిచే ద్రవం ఒక చిన్న ట్యూబ్‌లో ఉంటుంది.

సాధారణంగా దీన్ని ఐసీ కాయిల్ అని అంటారు. టీవీ, రేడియోల్లో లోపలకి వచ్చే శబ్ద తరంగాల నాణ్యత తగ్గితే… తిరిగి ఆ తరంగాలు బయటకు వెళ్లేటప్పుడు నాణ్యతను పెంచడానికి ఉపయోగపడే పరికరాల్లో ఇది ఒకటి. దీని విలువ కూడా చాలా తక్కువ.

వీటిని సాధారణంగా ఆంప్లిఫయింగ్ సెక్షన్ మెటీరియల్ అంటారు. అయితే ఇప్పుడు వీటి స్థానంలో డయోడ్‌లను వినియోగిస్తున్నారు. ఈ డయోడ్ల విలువ నాణ్యతను బట్టి పది రూపాయల నుంచి అరవై రూపాయల వరకూ ఉంటుంది” అని వివరించారు.

మెర్క్యరీ అంటేనే ఎరుపు రంగు…

రెడ్ మెర్క్యురీలో అద్భుత శక్తి ఉందనే వదంతులు కొన్ని దశాబ్దాలుగా ఉన్నాయి.

ఇప్పటికీ కొంతమందిలో ఆ నమ్మకం కొనసాగుతూనే ఉంది. కొందరు రెడ్ మెర్క్యురీకి రోగాలను నయం చేసే గుణం ఉందని నమ్ముతారు.

అలాగే దీనికి ఉన్న అత్యంత శక్తిమంతమైన అణు ధార్మిక శక్తి ప్రపంచాన్ని నాశనం చేస్తుందని ఇంకొందరు విశ్వసిస్తున్నారు.

పాత టీవీలు, రేడియోలు, కుట్టు మిషన్లు, గబ్బిలాల గూళ్లలో రెడ్ మెర్క్యురీ లభిస్తుందంటూ యూట్యూబ్‌లో అనేక వీడియోలున్నాయి.

అయితే, ఈ రెడ్ మెర్క్యురీ అనేది ఒక కల్పన మాత్రమేనని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

సిడ్నీలోని మాక్వైరీ విశ్వవిద్యాలయం ఆంత్రొపాలజీ ప్రొఫెసర్ లీసా విన్ ‘రెడ్ మెర్క్యురీ’ విషయంలో తన అనుభవాలను గతంలో బీబీసీకి చెప్పారు.

“కొందరు మోసగాళ్లు అమాయకులైన ప్రజలను దోచుకునేందుకు ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు. వాటిని నమ్మి, అమ్మేందుకు లేదా కొనేందుకు ఎవరైనా వెళ్తే భౌతికదాడులు చేసి వారి దగ్గరున్న విలువైన వస్తువులను లాక్కుంటారు. ఈజిప్టులో చాలా మంది అరబ్బులు రెడ్ మెర్క్యురీ ఉందనీ… అది అనేక రోగాలను నయం చేస్తుందని నమ్ముతారు. ముఖ్యంగా ఈజిప్టులోని ‘మమ్మీల’ నోట్లో రెడ్ మెర్క్యురీని ఉంచేవారని… దానిని ఎలాగైనా పొందాలని అనేక ప్రయత్నాలు చేసేవారు. అలాగే గబ్బిలాల గూళ్లలో కూడా ఉంటుందని నమ్మి, వాటికోసం వేట సాగించేవారు. రెడ్ మెర్క్యురీకి ఆత్మలను వశం చేసుకునే శక్తి ఉందని నమ్ముతారు. ఇక 2009లో సౌదీ అరేబియాలో సింగర్ కంపెనీ కుట్టు మిషన్‌లో రెడ్ మెర్క్యురీ ఉంటుందనే వార్తలు విపరీతంగా చక్కర్లు కొట్టాయి” అని చెప్పారు.
అణ్వాయుధాలు చేయొచ్చని ప్రచారం
1980 దశకంలో జర్నలిస్టుగా పని చేసిన మార్క్ హిబ్స్ రెడ్ మెర్క్యురీ గురించి మరింత సమాచారాన్ని గతంలో బీబీసీతో పంచుకున్నారు.

“అప్పట్లో (1980) ఒక న్యూక్లియర్ మెటీరియల్‌ను సోవియట్ ల్యాబుల్లో తయారు చేశారనే వదంతులు ఉండేవి. ప్రయోగశాలల్లో తయారైన న్యూక్లియర్ మెటీరియల్ అంటూ దానిని కొంత మంది రహస్యంగా అమ్మేవారు. అది చాలా శక్తిమంతమైనదని… దానితో అణ్వాయుధాలు తయారు చేయవచ్చునని నమ్మేవారు. దాన్నే రెడ్ మెర్క్యురీ అని పిలిచేవారు. అయితే తూర్పు యూరప్ దేశాలలో ఈ రెడ్ మెర్క్యురీ అక్రమ తరలింపులు జరిగేవి. తనిఖీల్లో భాగంగా పోలీసులకు దొరికిన ఈ పదార్థానికి ఎలాంటి ప్రత్యేకమైన శక్తులూ లేవని తేలింది. ఒక రకమైన న్యూక్లియర్ ఐసోటోప్‌కి రెడ్ మెర్క్యురీ అని కోడ్ నేమ్ పెట్టి ఉండవచ్చునని రష్యన్ శాస్త్రవేత్తలు అభిప్రాయపడేవారు. అసలు రెడ్ మెర్క్యురీ ఉందా? లేదా? అనే విషయంపై విలేకరుల సమావేశాల్లో రష్యా, అమెరికా ప్రభుత్వాలను ప్రశ్నించేవాళ్లం. అయితే వారి వద్ద నుంచి అవునని కానీ, కాదని కానీ ఎలాంటి సమాధానం వచ్చేది కాదు. దాంతో రెడ్ మెర్క్యురీ ఉందని చాలామంది నమ్మేవారు” అని మార్క్ హిబ్స్ చెప్పారు.

2004లో బ్రిటన్‌లో, 2015లో టర్కీలో రెడ్ మెర్క్యురీకీ సంబంధించిన అరెస్టులు జరిగాయని ద న్యూయార్క్ టైమ్స్ 2015లో ఒక కథనం ప్రచురించింది.

రెడ్ ఎలా కలిసిందంటే…
యునైటెడ్ సోవియెట్ రష్యా ఆర్మీకి రెడ్ ఆర్మీ అని పేరుండేది. ఈ ఆర్మీ ప్రయోగశాలల్లో అణ్వాయుధాల విస్ఫోట స్థాయిని పెంచేందుకు ఒక రేడియోధార్మిక పదార్థాన్ని తయారు చేసేవారనే ప్రచారం జరిగేది. రష్యా ఆర్మీ తయారు చేసింది కావడంతో దీనికి రెడ్ మెర్క్యురీ అనే పేరు వచ్చిందని అనేవారు.

ప్రస్తుతం పాత టీవీలు, రేడియోల్లో సిగ్నల్ ఆంప్లిఫయింగ్ కోసం ఉపయోగించే ద్రవం ఎరుపురంగులో ఉండడంతో దాన్నే రెడ్ మెర్క్యురీగా ప్రచారం చేస్తున్నారు.

2015లో కర్నాటక, 2020 జనవరిలో తమిళనాడులో రెడ్ మెర్క్యురీ అమ్మకాలు, కొనుగోళ్లకు సంబంధించి పోలీసులు కొందరిని అరెస్ట్ చేశారు. కానీ, వారి నుంచి స్వాధీనం చేసుకున్న పదార్థాలు కేవలం ఎరుపు రంగు కలిపిన మెర్క్యురీ , మెర్క్యురీ ఆక్సైడ్, డయాక్సైడ్లు మాత్రమే. నిజానికి మెర్క్యురీతో సంయోగం పొందే ఏ పదార్థమైనా సాధారణంగా ఎరుపు రంగులోనే ఉంటుంది. దీనికి కారణం మెర్క్యురీలో వర్మిలియాన్ అనే వర్ణ ద్రవ్యం ఉండటమే.

1994లో జర్మనీ పోలీసులు కొందరు వ్యక్తుల నుంచి రేడియో ధార్మికత కలిగిన పదార్థాన్ని స్వాధీనం చేసుకున్నారని… అందులో 61 శాతం మెర్క్యురీ, 11 శాతం ఆంటిమొనీ, 10 శాతం ప్లుటోనియం, 6 శాతం ఆక్సిజన్, 2 శాతం అయోడిన్, 1.6 శాతం గాలియంతో పాటు కొన్ని గాజు ముక్కలు ఉన్నాయని… దీన్ని రెడ్ మెర్క్యురీగా చెప్పారని అప్పటి మీడియా పేర్కొంది.

2004లో బ్రిటన్ పోలీసులు కూడా అక్రమంగా రవాణా అవుతున్న రేడియో ధార్మిక పదార్థాన్ని స్వాధీనం చేసుకున్నారని… దాన్ని కూడా రెడ్ మెర్క్యురీగానే మీడియా తెలిపింది.

మహిళల భావప్రాప్తి కోసం ఫ్రాన్స్ రాకుమారి మేరీ బోనపార్టీ చేసిన ప్రయోగాలేంటి?
సెక్స్ వర్కర్లు ఆ దేశంలో రెయిన్ కోట్ ఎందుకు వేసుకుంటున్నారు?
మహిమలున్నాయని అపోహలు
రెడ్ మెర్క్యురీతో గుప్త నిధుల ఆచూకీ కనుక్కోవడం, దీర్ఘకాలిక రోగాలను సైతం నయం చేయడం సాధ్యమనే ప్రచారాన్ని చాలా మంది నమ్ముతున్నారు. చివరకు కోవిడ్-19‌కి కూడా ఇదే మందని… కోవిడ్‌ని ఈ రెడ్ మెర్క్యురీ పూర్తిగా తగ్గిస్తుందని వదంతులు ఉన్నాయి.

పాత టీవీలు, కెమెరాలు, రేడియోలు కావాలంటూ ప్రతి రోజూ ఫోన్లు వస్తున్నాయని విశాఖ నగరానికి చెందిన టీవీ మెకానిక్ నాగరాజు తెలిపారు. 50, 60 ఏళ్ల కిందటి టీవీలను తాను చూడలేదని చెబుతున్నప్పటీకి… ఎక్కడైనా ఉంటే సమాచారమైనా ఇవ్వమంటున్నారని ఆయన తెలిపారు.

అయితే వాల్వ్ టీవీలు, వాల్వ్ రేడియోలుగా పిలిచే ఇవి ఇప్పుడు దొరకడం దాదాపు అసాధ్యమని ఆయన అంటున్నారు. రెడ్ మెర్క్యురీ కానీ… మరే ఇతర ఖరీదైన పదార్థాన్నైనా కెమెరాలు, టీవీల్లో వాడతారని చెప్పడం కేవలం జనాలని మోసం చేయడానికేనని అన్నారు.

‘ఆరు మిల్లీ లీటర్లు… రూ.3 కోట్లు’

రెడ్ మెర్క్యురీతో కోట్ల రూపాయలు సంపాదించవచ్చునని, దాని వేటలో కొంత డబ్బుని ఖర్చు చేసి చివరకు బాధితుడిగా మారిన విశాఖ జిల్లా నర్సీపట్నానికి చెందిన పేరు చెప్పడానికి ఇష్టపడని వ్యక్తి బీబీసీతో మాట్లాడారు.

“టీవీలు, ఫోన్లు, రేడియోల్లో ఉండే ఐసీ కాయిల్స్ బయట పది రూపాయలకే దొరుకుతాయి. వాటిలో గోళ్ల రంగు, ఎర్ర రంగులో ఉండే నూనెలను వేసి పాత రేడియోలు, టీవీల్లోని ఐసీ కాయిల్స్‌లో అమరుస్తారు. ఆ ఐసీ కాయిల్స్‌నే రెడ్ మెర్క్యురీ ట్యూబ్స్ అంటూ నమ్మించి వాటిని అమ్మకానికి పెడతారు. నిజానికి అదంతా ఒక నాటకం. ముందు రెడ్ మెర్క్యురీకి ఒరిజినాలిటీ పరీక్షలు కూడా చేసి చూపిస్తారని… వెల్లులి, బంగారు ఆభరణాలను రెడ్ మెర్క్యురీగా చెప్పే పదార్థం ఉన్న ట్యూబ్ వద్దకు తీసుకుని వెళ్లగానే అది వికర్షించడం లేదా వెలిగేటట్లుగా ముందుగానే ఏర్పాట్లు చేస్తారు.

వెల్లులి, బంగారం, అద్దం పరీక్షలు చేసి అది అసలైన రెడ్ మెర్క్యురీ అని నన్ను నమ్మించే ప్రయత్నం చేశారు. కానీ, నాకు అనుమానం రావడంతో మోసం చేస్తున్నారని తెలిసింది. ఐసీ కాయిల్స్‌లో గరిష్ఠంగా ఆరు, ఏడు మిల్లీ లీటర్లకు మించి ద్రావణాన్ని (రెడ్ మెర్క్యురీ ) నింపలేం… ఆ ద్రావణానికే సుమారు మూడు కోట్ల రూపాయిల ధర పలుకుతుందని అనడం ఆశ్యర్యం కలిగించింది. అసలు ఆ ద్రావణాన్ని ఎవరు తీసుకుంటారో, ఆ డబ్బు ఎవరు ఎవరికి ఇస్తారో… ఇలాంటి విషయాలు కూడా కనీసం ఎవరికీ తెలియవు.

కానీ ఆ ద్రావణం ఉంటే కోట్లే అంటూ ఒకరి నుంచి మరొకరికి సమాచారం చాలా వేగంగా వెళ్తూ… రెడ్ మెర్క్యురీ కోసం వెతుకుతున్నారు” అని చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Shares