లోకేష్ పర్యటనలో ‘జై జగన్..’ నినాదాలు.. రెచ్చగొడుతున్నారన్న టీడీపీ… రంగంలోకి పోలీసులు…

ఏపీలో కురుస్తున్న భారీ వర్షాలకు కోనసీమలో పంట నష్టంతో పాటు పలు ప్రాంతాలు ముంపుకు గురైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేష్ సోమవారం(అక్టోబర్ 19) తూర్పు గోదావరి జిల్లాలోని జగ్గంపేట, ప్రత్తిపాడు, పిఠాపురం ,ఉప్పాడ కొత్తపల్లి, అనపర్తి నియోజకవర్గాల్లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. లోకేష్ పర్యటన సందర్భంగా స్థానిక వైసీపీ నేతలు,కార్యకర్తలు ‘జై జగన్… జై జగన్…’ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేయడంతో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి.
వైసీపీ కార్యకర్తలు తమను రెచ్చగొట్టేందుకే ‘జై జగన్..’ అంటూ నినాదాలు చేశారని టీడీపీ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. టీడీపీ నేతలెవరూ రాష్ట్రంలో పర్యటించకూడదా అని ప్రశ్నించారు. వైసీపీ కార్యకర్తల తీరు సరిగా లేదని… లోకేష్ పర్యటనను అడ్డుకునేలా వ్యవహరించడం సరికాదని అన్నారు. పరిస్థితులు అదుపు తప్పే అవకాశం ఉండటంతో వెంటనే పోలీసులు రంగంలోకి దిగారు. ప్రస్తుతం భారీ పోలీస్ బందోబస్తు నడుమే లోకేష్ పర్యటన కొనసాగుతోంది. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
రైతులతో మాట్లాడిన లోకేష్…
వరద ప్రభావిత ప్రాంతాల్లో వరద బాధితులతో మాట్లాడి లోకేష్ వారి సమస్యల గురించి తెలుసుకున్నారు. మొదట జగ్గయ్యపేటకు చేరుకున్న ఆయనకు టీడీపీ నేతలు స్వాగతం పలికారు. అక్కడినుంచి రామవరం చేరుకుని తన పర్యటనను ప్రారంభించారు. వరదలకు కూలిపోయిన ఇళ్లు,నీట మునిగిన పొలాలను పరిశీలించారు. అనంతరం కిర్లంపూడి మండలం గోనెడలో ఏలేరు వరదకు నీట మునిగిన పొలాలను పరిశీలించారు. స్థానిక రైతులతో మాట్లాడి వారి ఆవేదన విన్నారు.
రైతులు లేని ప్రభుత్వం…
వరదకు సంబంధించి కనీసం అధికారులు ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వలేదని లోకేష్ ఆరోపించారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగా వేల ఎకరాల్లో పంట నీట మునిగి రైతులు,కౌలుదార్లకు తీవ్ర నష్టం జరిగిందన్నారు. ఈ ఖరీఫ్ సీజన్లో ఏలేరుకు భారీ వరదలు వచ్చినా ప్రభుత్వం తమకు కనీస పరిహారం చెల్లించలేదని స్థానిక రైతులు కొందరు లోకేష్‌తో వాపోయారు. దీంతో ప్రభుత్వంపై మండిపడ్డ లోకేష్.. వైసీపీది రైతు ప్రభుత్వం కాదని… రైతులు లేని ప్రభుత్వం అని విమర్శించారు. వరదలతో కష్టాలపాలైన ప్రజలను ఆదుకునే తీరిక ప్రభుత్వానికి లేకుండా పోయిందన్నారు.