వచ్చే ఎన్నికల్లో జో బైడెన్ గెలిస్తే… చైనా గెలిచినట్టే!: డొనాల్డ్ ట్రంప్


ఉద్యోగాలను చైనీయులకు దోచిపెట్టిన బైడెన్
ఐదు దశాబ్దాల పాటు వ్యవస్థను నాశనం చేశారు
అమెరికాను ముందు నిలిపేది నేనే
ఓహియో ర్యాలీలో డొనాల్డ్ ట్రంప్
యూఎస్ మాజీ ఉపాధ్యక్షుడు జో బైడెన్, నవంబర్ లో జరిగే ఎన్నికల్లో అమెరికా అధ్యక్షుడిగా విజయం సాధిస్తే, అమెరికాపై చైనా విజయం సాధించినట్టేనని, అతని ప్రత్యర్థి, ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికా ఆర్థిక వ్యవస్థను ఐదు దశాబ్దాల పాటు నాశనం చేసిన ఏకైక వ్యక్తి బైడెనేనని అభివర్ణించిన ఆయన, అమెరికన్లపై చైనీయులు విజయం సాధించకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపైనా ఉందని అన్నారు.

కాగా, మరో నెలన్నరలో జరగనున్న ఎన్నికల్లో 74 ఏళ్ల వయసున్న డొనాల్డ్ ట్రంప్, అతని వైస్ ప్రెసిడెంట్ మైక్ పెన్స్ లను, 77 ఏళ్ల వయసున్న జో బైడెన్, అతని సహచర, వైస్ ప్రెసిడెంట్ అభ్యర్థిని కమలా హారిస్ సవాల్ చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా, ఓహియో రాష్ట్రంలోని డేటాన్ లో జరిగిన ర్యాలీని ఉద్దేశించి ప్రసంగించిన ట్రంప్, గడచిన 47 సంవత్సరాలుగా చైనా సహా పలువురు విదేశీయులకు అమెరికన్లకు దక్కాల్సిన ఉద్యోగాలు వెళ్లేట్లుగా బైడెన్ చేశాడని ఆరోపించారు.

గత నాలుగేళ్లలో తాను దేశ ప్రజలకు దక్కాల్సిన ఉద్యోగాలను తిరిగి తీసుకుని వచ్చానని డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. నవంబర్ 3న దేశ ప్రజలు, తదుపరి నాలుగేళ్ల తమ భవిష్యత్తును నిర్ణయించుకోవాల్సి వుంటుందని, అమెరికన్లపై మరే దేశ ఆధిపత్యాన్ని అంగీకరించని ఎవరూ బైడెన్ ను అధ్యక్షుడిగా ఎంచుకోరని అన్నారు. నిద్రమత్తులో ఉండే బైడెన్ అధికారంలోకి వస్తే, ఆర్థిక వ్యవస్థ సర్వ నాశనం అవుతుందని, పన్నులను ఆయన పెంచుతారని, ఓహియో క్లీన్ కోల్, ఆయిల్, నాచురల్ గ్యాస్ డీల్స్ ను ఆయన రద్దు చేస్తారని ట్రంప్ వ్యాఖ్యానించారు.

బైడెన్ అధికారంలోకి వస్తే, ఇప్పటివరకూ అమెరికన్లు పేరును కూడా వినని దేశాలకు చెందిన పౌరులకు ఉద్యోగాలను ఇస్తారని, వారందరినీ దేశంలోకి రప్పిస్తారని ట్రంప్ విమర్శలు గుప్పించారు. 4 ట్రిలియన్ డాలర్ల పన్ను భారం దేశ ప్రజలపై పడుతుందని అన్నారు.”ఒక్క మాటలో చెబుతున్నా. బైడెన్ గెలిస్తే, చైనా గెలిచినట్టే. మనం గెలిస్తే, ఓహియో గెలిచినట్టే. ఇంకా ముఖ్యంగా… అమెరికన్లు గెలిచినట్టు. ఎందుకంటే, మీరంతా కలిసి అమెరికాను ముందు నిలపాల్సిన అధ్యక్షుడిని ఎన్నుకోనున్నారు. నేను అమెరికాను ముందు నిలిపాను” అని అన్నారు. ట్రంప్ ప్రసంగానికి ఆయన మద్దతుదారుల నుంచి కరతాళధ్వనులు మిన్నంటాయి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Shares