“వైఎస్ జగన్‌ను తక్షణం సీఎం పదవి నుంచి తొలగించండి”: సుప్రీంకోర్టులో పిల్

సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ ఎన్వీ రమణపై ఆరోపణలతో భారత ప్రధాన న్యాయమూర్తికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి లేఖ రాశారు
సుప్రీంకోర్టు న్యాయమూర్తిపై అవినీతి ఆరోపణలు చేసిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డిని ఆ పదవి నుంచి తక్షణం తప్పించాలంటూ ఇద్దరు న్యాయవాదులు సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు.
సీఎం జగన్ మోహన్ రెడ్డిపై మనీలాండరింగ్, అవినీతి సహా 20 క్రిమినల్ కేసులు నడుస్తున్నాయని ఈ వ్యాజ్యం వేసిన న్యాయవాదులు జి.ఎస్.మణి ప్రదీప్ కుమార్ యాదవ్‌లు తమ పిటిషన్లో పేర్కొన్నారు.
ఎలాంటి ఆధారాలు లేకుండా సుప్రీంకోర్టు న్యాయమూర్తిపై ప్రజలు, మీడియా ముందు అవినీతి ఆరోపణలు చేసిన జగన్ మోహన్ రెడ్డిని తక్షణం సీఎం పదవి నుంచి తొలగించాని వారు సుప్రీంకోర్టుకు విజ్జప్తి చేశారు.
ముఖ్యమంత్రి పదవిని వ్యక్తిగత ప్రయోజనాలకు ఉపయోగించుకుంటూ సుప్రీంకోర్టు జడ్జి పేరు ప్రతిష్టలకు భంగం కలిగించేలా జగన్మోహన్ రెడ్డి ఆరోపణలు చేశారని పిటిషనర్లు అన్నారు.
ఈ ఆరోపణలపై సిట్టింగ్ లేదా రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జ్ లేదా సీబీఐ సహా మరే ఇతర సంస్థ అధికారులతోనైనా ఒక అంతర్గత కమిటీ వేసి జ్యుడిషియల్ ఎంక్వైరీ జరిపించాలని వారు తమ పిటిషన్లో సుప్రీంకోర్టును కోరారు.
మరోవైపు సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణపై ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, ఆయన ప్రభుత్వం చేసిన ఆరోపణలు న్యాయవ్యవస్థ స్వతంత్ర ప్రతిపత్తిపై దాడి ప్రయత్నంగా దిల్లీ హైకోర్టు బార్ అసోసియేషన్ అభివర్ణించింది.
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి తాము చేసిన ఫిర్యాదును జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా మీడియాకు వెల్లడించిందని, దీనిని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని అసోసియేషన్ తన ఏకగ్రీవ తీర్మానంలో పేర్కొంది.
మరోవైపు సుప్రీంకోర్టు న్యాయమూర్తిపై ముఖ్యమంత్రి చేసిన ఆరోపణలు దురదృష్టకరమని, దీనివల్ల న్యాయవ్యవస్థపై ప్రజల్లో నమ్మకం సన్నగిల్లుతుందని సుప్రీంకోర్టు అడ్వొకేట్స్ ఆన్ రికార్డ్ అసోసియేషన్(SCAORA) ఆందోళన వ్యక్తం చేసింది. ఈ చర్యను తీవ్రంగా ఖండిస్తున్నామని అసోసియేషన్ ఒక ప్రకటనలో పేర్కొంది.