వైసీపీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డికి రెండోసారి సోకిన కరోనా.. మళ్లీ పాజిటివ్‌గా నిర్ధారణ


ఆగస్టులో ఎమ్మెల్యేకి కరోనా సోకడంతో రుయా ఆస్పత్రిలో వైద్యసేవలు చికిత్స పొందారు. ఆ తర్వాత కోలుకొని ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. నెలన్నర రోజుల తర్వాత ఆయనకు మళ్లీ పాజిటివ్ వచ్చింది.

కరోనా వైరస్ గురించి ఇప్పటికీ మనలో చాలా మందికి అపోహలున్నాయి. ఒకసారి కరోనా వచ్చిన తర్వాత మళ్లీ రాదని అనుకుంటున్నారు. కానీ ఇందులో నిజం లేదు. కరోనా నుంచి కోలుకున్న తర్వాత జాగ్రతలు తీసుకోకుంటే.. మరోసారి వైరస్ బారిన పడే ప్రమాదముంది. ఇప్పటికే చాలామందికి రెండోసారి కరోనా సోకింది. ఆ జాబితాలో వైసీపీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి చేరారు. చిత్తూరు జిల్లా తిరుపతి వైసీపీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డికి రెండోసారి కరోనా సోకింది. తిరుపతిలోని ఓ ప్రైవేటు ల్యాబ్‌లో బుధవారం నిర్వహించిన పరీక్షలో ఆయనకు కరోనా పాజిటివ్‌ నిర్ణారణ అయింది. గురువారం మరోసారి ప్రభుత్వ ఆసుపత్రిలో పరీక్షలు చేసుకోనున్నారు. ఆ ఫలితం ఆధారంగా తదుపరి వైద్యసేవలు పొందనున్నారు. కాగా, ఆగస్టులో ఎమ్మెల్యేకి కరోనా సోకడంతో రుయా ఆస్పత్రిలో వైద్యసేవలు చికిత్స పొందారు. ఆ తర్వాత కోలుకొని ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. నెలన్నర రోజుల తర్వాత ఆయనకు మళ్లీ పాజిటివ్ వచ్చింది.

కరోనాతో ఇటీవల వైసీపీ నేత ద్రోణంరాజు శ్రీనివాస్ మరణించారు. అంతకుముందు సెప్టెంబరు 16న తిరుపతి ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ కూడా కరోనాతో కన్నుమూశారు. అంతలోనే మరో సీనియర్ నేత మరణించడంతో.. వైసీపీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఏపీలో డిప్యూటీ అంజాద్ బాషా, మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి, ఆదిమూలపు సురేష్‌తో పాటు ఎంపీలు విజయసాయిరెడ్డి, చిత్తూరు ఎంపీ రెడ్డిప్ప, అరకు ఎంపీ మాధవి, ఎమ్మెల్యేలు అంబటి రాంబాబు, కరణం బలరాం, బియ్యపు మధుసుధన్ రెడ్డి, ఎన్. వెంకటయ్య గౌడ్, ముస్తఫా, అన్నాబత్తుల శివకుమార్, కిలారి రోశయ్య, హఫీజ్ ఖాన్, గంగుల బిజేంద్ర రెడ్డి, అన్నా రాంబాబు, డాక్టర్ సుధాకర్, గొల్ల బాబూరావు, కే. శ్రీనివాసరావు, విశ్వసరాయి కళావతి కరోనా బారినపడ్డారు. వీరిలో చాలా మంది ఇప్పటికే కోలుకున్నారు.

ఏపీలో కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. బుధవారం నాటి బులెటిన్ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 5120 కేసులు నమోదయ్యాయి. వీటితో కలిపి ఏపీలో ఇప్పటివరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 731532కు చేరుకుంది. రాష్ట్రంలో కొత్తగా 34 కరోనా మరణాలు నమోదయ్యాయి. కొత్తగా చిత్తూరు జిల్లాలో 807, తూర్పు గోదావరి 807, పశ్చిమ గోదావరి 575, గుంటూరు 433, కృష్ణా 464, అనంతపురం 424, నెల్లూరు 367, కడప 301, ప్రకాశం 264, విశాఖ 190, శ్రీకాకుళం 172, విజయనగరం 172, కర్నూలు జిల్లాలో 144 కేసులు నమోదయ్యాయి.

ఇక కరోనా రికవరీల సంఖ్య పెరుగడం ఊరటనిచ్చే విషయం. గడిచిన 24 గంటల్లో కొత్తగా 6349 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. దీంతో ఏపీలో ఈ మహమ్మారిని జయించిన వారి సంఖ్య 675933‌కు చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 49513గా ఉంది. ఏపీలో కొత్తగా 66769 కరోనా పరీక్షలు నిర్వహించారు. వీటితో కలిపి ఏపీలో ఇప్పటివరకు నిర్వహించిన కరోనా టెస్టుల సంఖ్య 6283009కు చేరుకుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Shares