శుక్ర గ్రహంపై జీవం ఉందా.. శాస్త్రవేత్తలు ఏం చెబుతున్నారు

శుక్ర గ్రహంపై ఆవరించిన వాతావరణంలో జీవం ఉండే ఉండే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
ఆ గ్రహం మీద ఒక వాయువుకు సంబంధించిన ఆధారాలు కనుగొన్న శాస్త్రవేత్తలు ఆ వాయువు అక్కడికి ఎలా వచ్చిందో తెలుసుకునే ప్రయత్నాల్లో ఉన్నారు.
శుక్రుడిపై ఉన్న ఆ గ్యాస్ పేరు ఫాస్ఫిన్. ఒక ఫాస్పరస్ అణువుతో మూడు హైడ్రోజన్ అణువులు కలవడం వల్ల ఈ వాయువు ఏర్పడుతుంది.
ఫాస్ఫిన్ భూమి మీద జీవంతో ముడిపడి ఉన్న వాయుడు. పెంగ్విన్ వంటి జంతువుల కడుపులో ఇది ఉంటుంది. అలాగే, ఆక్సిజన్ తక్కువగా ఉండే చిత్తడి నేలల్లో బతికే సూక్ష్మజీవులు కూడా ఫాస్ఫీన్లో మనుగడ సాగిస్తుంటాయి.
పారిశ్రామికంగా కూడా ఫాస్ఫీన్‌ను తయారు చేయవచ్చు. కానీ శుక్రుడిపై ఫ్యాక్టరీలు లేవు. పెంగ్విన్లూ లేవు.
మరి ఆ గ్యాస్ అక్కడ ఎలా ఉంది.. శుక్రుడి ఉపరితలానికి 50 కిలోమీటర్ల దూరంలో ఎలా ఆవరించి ఉంది? యూకేలోకి కార్డిఫ్ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ జేన్ గ్రీవ్స్, ఆయన సహచరులు ఇదే సందేహాన్ని వ్యక్తం చేస్తున్నారు.
శుక్రగ్రహం మీద ఫాస్ఫీన్ గ్యాస్ ఆనవాళ్లను వివరిస్తూ నేచర్ ఆస్ట్రానమీ జర్నల్‌కు వీరు ఒక పరిశోధనా పత్రాన్ని సమర్పించారు. ఇక్కడ ఈ గ్యాస్ ఎలా ఏర్పడిందో కనుగొనేందుకు తాము చేసిన ప్రయత్నాలను వివరించారు.
శుక్రుడి మీద గ్యాస్ ఉందని తెలుసుకుని ఆశ్చర్యపోయామని బీబీసీలో ప్రసారమయ్యే ‘స్కై ఎట్ నైట్’ కార్యక్రమంలో వారు వెల్లడించారు.
ఇప్పటివరకు మన దగ్గరున్న శుక్రుడి సమాచారం, అక్కడి పరిస్థితులను తెలిసిన వారెవరూ ఆ గ్యాస్ అక్కడికి ఎలా వచ్చిందో మాత్రం చెప్పలేకపోతున్నారు. కానీ అక్కడ జీవం ఉందనడాన్ని కొట్టిపారేయలేని పరిస్థితి.
“నా కెరీర్ అంతా విశ్వాంతరాళంలో ఎక్కడ జీవం ఉందో వెతకడంలో గడిపాను. ఇప్పుడు అది సాధ్యమవుతుందని నాకనిపిస్తోంది’’అని ప్రొఫెసర్ గ్రీవ్స్ వ్యాఖ్యానించారు. “ మా పరిశీలనలో ఏవైనా లోపాలున్నాయేమో చెప్పాలని కూడా మేం కోరుతున్నాం.
మా పేపర్ ఇంటర్నెట్లో అందరికీ అందుబాటులో ఉంది’’ అన్నారు గ్రీవ్స్