సరిహద్దు సమగ్రతను కాపాడడంలో రాజీ పడే ప్రసక్తే లేదన్న రాజ్‌నాథ్ సింగ్

భారత – చైనా సరిహద్దు ఉద్రిక్తతల గురించి రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మంగళవారం నాడు పార్లమెంటులో వివరణ ఇచ్చారు. ఇప్పటికీ తూర్పు లద్దాఖ్‌లోని గోగ్రా, కోంగ్కా లా ప్రాంతాలలో వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ) వెంబడి చైనా భారీగా బలగాలను మోహరించిందని రాజ్‌నాథ్ తెలిపారు.
పాంగాంగ్ సరస్సు ఉత్తర – దక్షిణ తీరాల వెంబడి కూడా చైనా సేనలు ఉన్నాయని రక్షణ మంత్రి తెలిపారు. చైనా చర్యలకు దీటుగా సరిహద్దు రక్షణ కోసం ఆయా ప్రాంతాలలో భారత సైనిక దళాలను కూడా మోహరించామని, భారత సైనిక దళాలు ఎలాంటి సవాళ్లనైనా సమర్థంగా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాయని పార్లమెంటు పూర్తి విశ్వాసంతో ఉండాలని ఆయన కోరారు.
ఈ మేరకు రక్షణ శాఖ విడుదల చేసిన ప్రకటనలో రాజ్‌నాథ్ సింగ్, “ఉద్రిక్త పరిస్థితులు ఇంకా కొనసాగుతున్నాయి. ఇది చాలా సున్నితమైన విషయం కాబట్టి, దీని మీద మరిన్ని వివరాలు ఇవ్వలేకపోతున్నా. కోవిడ్ వ్యాపిస్తున్న సమయంలో ఈ ప్రాంతాలతో పాటు ఐటీబీపీ వద్ద కూడా సైనిక దళాలు అప్రమత్తంగా ఉన్నాయి” అని అన్నారు
చైనాతో సరిహద్దు సమస్యలను శాంతియుతంగా పరిష్కరించుకోవాలని భావిస్తున్నామని, అయితే ఆ దేశం కూడా అందుకు సానుకూలంగా స్పందించాలని ఆయన కోరారు.
తాజా పరిస్థితులను పార్లమెంటుకు నివేదిస్తూ ఆయన ఇంకా, “గత కొన్నేళ్లుగా భారత ప్రభుత్వం సరిహద్దు ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు అధిక ప్రాధాన్యం ఇస్తోంది. ఇటీవలి కాలంలో చైనా సరిహద్దు వద్ద సైనిక మోహరింపు సామర్థ్యాన్ని పెంచుకోవడానికి చాలా నిర్మాణాలు చేపట్టింది. దాంతో, భారత ప్రభుత్వం కూడా సరిహద్దు ప్రాంత అభివృద్ధి కోసం బడ్జెట్‌ను గణనీయంగా పెంచింది. దీనివల్ల ఆయా ప్రాంత ప్రజలకు సౌకర్యాలు లభించడమే కాకుండా, సైనికులకు వ్యూహాత్మక మద్దతు లభించినట్లయింది” అని అన్నారు.