హిందూ మతానికి పట్టిన దౌర్భాగ్యం: కొడాలి నానికి కౌంటర్: సీబీఐ మాజీ బాస్ మన్నెం: సర్కార్ కబ్జా

అమరావతి: తూర్పు గోదావరి జిల్లా సఖినేటి పల్లి మండలం అంతర్వేదిలో వెలసిన శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానానికి చెందిన రథం మంటల్లో దగ్దమైన తరువాత రాష్ట్ర రాజకీయాల్లో నెలకొన్న వేడి ఇంకా తగ్గట్లేదు. రాష్ట్రంలో హిందూ దేవాలయాలపై దాడులు కొనసాగుతున్నాయనే విషయాన్ని మరికొంత కాలం పాటు సజీవంగా ఉంచే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దిద్దుబాటు చర్యలను తీసుకుంటున్నప్పటికీ.. ఒకరిద్దరు మంత్రుల ధోరణి నిప్పు రాజేస్తోనే వస్తోంది. మంత్రుల వ్యాఖ్యలకు భారతీయ జనతా పార్టీ రాష్ట్రశాఖ నాయకులు కౌంటర్లు ఇస్తుండటంతో ఆ మరింత రాజుకుంటూనే వస్తోందా అంశం.

నిప్పు రాజేసిన కొడాలి నాని కామెంట్స్..
రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని చేసిన తాజా వ్యాఖ్యలు మరింత ఆజ్యం పోసినట్లు కనిపిస్తున్నాయి. దీనిపై ఇప్పటికే బీజేపీ నాయకులు భగ్గుమంటున్నారు. ఆయనపై కౌంటర్ అటాక్‌కూ దిగారు. కొడాలి నానికి సద్బుద్ధిని ప్రసాదించాలని కోరుతూ రాష్ట్రవ్యాప్తంగా పలు ఆంజనేయస్వామివారి ఆలయాల్లో బీజేపీ నేతలు వినతిపత్రాలను అందించారు. ఓ ఉద్యమంలా దీన్ని కొనసాగిస్తున్నారు. బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు స్వయంగా ఇందులో పాల్గొన్నారు. హిందూ ధర్మాన్ని కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన నేతలు ఎంతటివారైనా శిక్షించాల్సిందేనంటూ డిమాండ్ చేస్తున్నారు.
ప్రభుత్వ కబ్జా వల్లే..
ఇదిలా కొనసాగుతుండగానే.. కొడాలి నానిపై మరో గట్టి కౌంటర్ పడింది. ఈ కౌంటర్ ఇచ్చింది మరెవరో కాదు.. సీబీఐ మాజీ ఇన్‌ఛార్జి డైరెక్టర్ మన్నెం నాగేశ్వర రావు. కొడాలి నాని వ్యాఖ్యలపై ఆయన తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. హిందూ దేవాలయాలపై కొనసాగుతోన్న దాడులపై తాను చర్చకు సిద్ధమని ప్రకటించారు. దేవాలయాల్లో కొనసాగుతోన్న వివక్ష వల్లే హిందూమతం దెబ్బతింటోందంటూ కొడాలి నాని చేసిన వ్యాఖ్యలను మన్నెం నాగేశ్వర రావు తప్పుపట్టారు. హిందూ మతం దెబ్బతినడానికి ప్రధాన కారణం.. దేవాలయాలపై ప్రభుత్వం కబ్జా చేయడమేనని విమర్శించారు.

హిందూ మతానికి పట్టిన దౌర్భాగ్యంపై చర్చకు రెడీ..
ఆలయాలను ప్రభుత్వం నియంత్రిస్తోందని, అందువల్లే వివక్ష చోటు చేసుకుందని ఆరోపించారు. హిందూ మతానికి పట్టి దౌర్భగ్యాన్ని, ఇతర సమస్యలపై విశదీకరించడానికి తాను సిద్ధంగా ఉన్నానని నాగేశ్వర రావు తెలిపారు. కొడాలి నాని తనతో చర్చకు సిద్ధపడాలని సవాల్ విసిరారు. వీలు చూసుకుని తనకు సమాచారం ఇవ్వాలని చురకలు అంటించారు. ప్రభుత్వం అనుసరిస్తోన్న వైఖరి, దురదృష్టకర విధానాల వల్లే దేవాలయాలపై దాడులు కొనసాగుతున్నాయనే విషయాన్ని ఆయన పరోక్షంగా వెల్లడించారు. ఆలయాలను ప్రభుత్వం కబ్జా చేసిందని మండిపడ్డారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Shares