హైదరాబాద్ రోడ్ల మీద ఈత: స్విమ్మింగ్ పూల్‌గా మారిన విశ్వనగరం రోడ్లు:


హైదరాబాద్: భారీ వర్షాలు మరోసారి హైదరాబాద్‌ను ముంచెత్తాయి. మూడు రోజుల కిందట భాగ్యనగరం వెన్నులో వణుకు పుట్టించిన భారీ వర్షాలు.. మళ్లీ తిరిగొచ్చాయి. సగటు హైదరాబాదీపై ప్రతాపాన్ని చూపాయి. ఫలితంగా- పాత కథే పునరావృతమైంది. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. అనేక నివాసాలు వర్షపునీటితో నిండిపోయాయి. మొన్నటి భారీ వర్షాల నుంచి తేరుకోలేకపోతోన్న హైదరాబాద్‌పై మరోసారి పిడుగుల కొరడా ఝుళిపించింది వాతావరణం. పులి మీద పుట్ర అన్నట్టు తాజా వర్షాలతో మళ్లీ నీట మునిగింది.

శనివారం సాయంత్రం నుంచీ అర్ధరాత్రి దాటేంత వరకూ హైదరాబాద్ నగర వ్యాప్తంగా భారీ వర్షాలు కురిశాయి. దీని దెబ్బకు లోతట్టు ప్రాంతాలు మళ్లీ మునకేశాయి. లోతట్టు ప్రాంతాలను వరద నీరు ముంచెత్తింది. రోడ్లు జలమయం అయ్యాయి. ఫలితంగా వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కొన్ని గంటల పాటు ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. మూడురోజుల కిందట కురిసిన భారీ వర్షాల వల్ల దెబ్బతిన్న రోడ్లు మరింత ఛిద్రం అయ్యాయి. వాటిల్లో వర్షపు నీరు చేరుకుంది. నడి రోడ్డు మీద నడుములోతు వరకు వర్షపు నీరు నిలిచింది. ఆ వరద నీటిలో ఓ యువకుడు ఈత కొట్టడం కనిపించింది.

హైదరాబాద్ శివార్లలోని ఎల్బీ నగర్ వద్ద చింతల్‌కుంట సమీపంలో జాతీయ రహదారిపై ఈ ఘటన చోటు చేసుకుంది. స్వేచ్ఛగా, ఎలాంటి ఇబ్బందుల్లేకుండా ఈత కట్టేంత వర్షపునీరు నడిరోడ్డు మీద నిలిచింది. రోడ్డు మీద ఆ స్థాయిలో గోతులు ఏర్పడ్డాయనే విషయాన్ని ఆ యువకుడు చెప్పకనే చెప్పినట్టయింది. దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సో కాల్డ్ విశ్వనగరం దుస్థితిని ప్రపంచానికి చాటి చెప్పింది.

క్యుములోనింబస్ మేఘాల వల్ల భారీ వర్షాలు పడినట్లు అధికారులు చెబుతున్నారు. ఫలితంగా.. బండ్లగూడ-11.9, పెద్ద అంబర్‌పేట్-11.1, తట్టిఅన్నారం-11.1, కందికల్ గేట్-11.0, నాగోల్-10.5, ప్రశాంత్ నగర్-105, పీర్జాదిగూడ-9.9, సరూర్ నగర్-9.6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు వెల్లడించారు. మూడు రోజుల కిందటి భారీ వర్షాల వల్ల కాలనీల్లో చేరిన వరదనీరు ఇంకా పోలేదు. నీటిని తోడేసే పనులను గ్రేటర్ హైదరాబాద్ అధికారులు కొనసాగిస్తోన్న ప్రస్తుత పరిస్థితుల్లో తాజాగా కురిసిన భారీ వర్షాలు మరిన్ని ఇబ్బందులను సృష్టించాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Shares