
మమ్మల్ని రెచ్చగొట్టకండి.. చైనాకు మోడీ వార్నింగ్
జైసల్మేర్: ప్రధాని మోడీ దీపావళి సంబురాలను సరిహద్దుల వద్ద పహారా కాస్తున్న సైనికులతో కలసి జరుపుకున్నారు. రాజస్థాన్‌లోని జైసల్మేర్, లాంగేవాలా పోస్ట్‌లో జవాన్లతో కలిపి నిర్వహించిన సెలబ్రేషన్స్‌లో పాల్గొన్న మోడీ.. సరిహద్దు అంశాలతోపాటు పలు విషయాలపై మాట్లాడారు. చైనా దూకుడును, కవ్వింపు చర్యలను మోడీ తప్పుబట్టారు. భారత్ ఓపికను పరీక్షిస్తే గట్టి ప్రతిఘటనను ఎదుర్కోవాల్సి ఉంటుందని డ్రాగన్ కంట్రీకి పరోక్షంగా వార్నింగ్ ఇచ్చారు.
‘సరిహద్దుల వద్ద ఎవరైనా మమ్మల్ని పరీక్షిస్తే దీటుగా బదులిస్తాం. ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ముందుకెళ్లే ధో్రణిని మేం అవలంబిస్తాం. అయినా అవతలి వాళ్లు మమ్మల్ని పరీక్షించాలని చూస్తే మాత్రం భయంకరమైన ప్రతిఘటనను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ప్రతి దీపావళికి నేను సైనికులను ఎందుకు కలుస్తున్నానని కొందరు ఆశ్చర్యపోతున్నారు. కానీ దీపావళి అనేది కుటుంబ సభ్యులు, సొంతవాళ్లతో కలసి చేసుకునే పండుగ అని వాళ్లు మర్చిపోతున్నారు. సైనికులందరూ నా కుటుంబమే, నా సొంతవాళ్లే. అందుకే ప్రతి దీపావళిని జవాన్లతో కలసి సెలబ్రేట్ చేసుకుంటున్నా’ అని మోడీ పేర్కొన్నారు.