2 నుండి పాఠశాలలు ప్రారంభం :రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ –

శ్రీకాకుళం, అక్టోబర్ 22 : రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలు నవంబరు 2 నుండి తెరుచుకోవాలని రాష్ట్ర విద్యాశాఖామాత్యులు ఆదిమూలపు సురేష్ విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. గురువారం సాయంత్రం పాఠశాలలు ప్రారంభం, మధ్యాహ్న భోజనం పథకం అమలు, తరగతుల నిర్వహణ వంటి పలు అంశాలపై సంయుక్త కలెక్టర్లు, విద్యాశాఖ అధికారులతో ఆయన వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నవంబర్ 2వ తేదీ నుండి రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలు ప్రారంభం కావాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. తొలిరోజున అనగా నవంబర్ 2న 1,3,5,7వ తరగతులకు, రెండో రోజు అనగా 3వ తేదీన 2,4,6,8 తరగతుల విద్యార్ధులకు, ఇలా రోజు విడిచి రోజు విద్యార్ధులకు పాఠ్యాంశాలను బోధించాలని చెప్పారు. 9,10 తరగతుల విద్యార్ధులకు ప్రతి రోజు విద్యను బోధించాలని సూచించారు. పాఠశాలలు ఉదయం 09.00గం.ల నుండి మధ్యాహ్నం 01.00గం.వరకు మాత్రమే తెరవాలని అధికారులను ఆదేశించారు. మధ్యాహ్నం భోజనం చేసిన అనంతరం విద్యార్థులు ఇంటికి వెళ్ళేలా రూపకల్పన చేయాలని చెప్పారు. నవంబర్ 31 వరకు ఈ విధంగా పాఠశాలలు తెరవాలని, డిసెంబరు 1 నుండి తరగతుల నిర్వహణపై తదుపరి నిర్ణయం తీసుకోవడం జరుగుతుందని ఆయన వెల్లడించారు. పాఠశాలల్లో నిర్వహిస్తున్న నాడు-నేడు కార్యక్రమం పూర్తికాని పాఠశాలల్లో నవంబర్ 15వ తేదీ వరకు కొనసాగించేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. ప్రతీ పాఠశాలలో తాగునీరు, పారిశుద్ధ్యం, పరిసరాల పరిశుభ్రత, మొక్కలు నాటే కార్యక్రమం తదితర అంశాలపై సంబంధిత కమిటీల ద్వారా పూర్తిచేయాలని చెప్పారు. ఎట్టిపరిస్థితిల్లోనూ నవంబర్ 10నాటికి మరుగుదొడ్లు పూర్తికావాలని, కరోనా వ్యాధి నియంత్రణలో భాగంగా వచ్చే మాసాంతం వరకు సామాజిక దూరం, మాస్కులను ధరించడం, శానిటైజేషన్ వాడకం వంటి తదితర పద్ధతులను అవలంభించేలా చర్యలు తీసుకోవాలని మంత్రి అధికారులను ఆదేశించారు. కరోనా నేపధ్యంలో తరగతి నందు 16 మంది విద్యార్థులు మాత్రమే ఉండేలా చర్యలు తీసుకోవాలని మంత్రి ఈ సందర్భంగా స్పష్టం చేసారు.

ఈ వీడియో సమావేశంలో సంయుక్త కలెక్టర్ డా. కె.శ్రీనివాసులు, జిల్లా విద్యాశాఖాధికారి కుసుమ చంద్రకళ, సమగ్ర శిక్ష పథక సంచాలకులు పైడి వెంకటరమణ, కార్యనిర్వాహక ఇంజినీర్ వెంకటకృష్ణ, ఉప కార్యనిర్వాహక ఇంజినీర్లు, సెక్టోరియల్ ఆఫీసర్లు, విద్యాశాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Share and Enjoy !

0Shares
0 0

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

0Shares
0