ట్రంప్ కు షాకివ్వనున్న ఇండో అమెరికన్లు.. ఇక ఆయనకు ఓటమి తప్పదా..?

U.S. President Donald Trump waves as he as walks on the South Lawn of the White House upon his return to Washington from Dover, Delaware, U.S., January 19, 2019. REUTERS/Yuri Gripas - RC1A05E75D00


ఇండో అమెరికన్ ఓటర్ల మీద ఆశ ఎన్నో ఆశలు పెట్టుకున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు భారతీయులు భారీ షాక్ ఇవ్వనున్నారా..? ఇప్పటికే అధ్యక్ష రేసులో వెనుకబడ్డ ట్రంప్ కు.. భారతీయుల మద్దతు కూడా కరువైందా అంటే అవుననే అంటున్నాయి సర్వేలు.
Us Elections 2020: ట్రంప్ కు షాకివ్వనున్న ఇండో అమెరికన్లు.. ఇక ఆయనకు ఓటమి తప్పదా..?

త్వరలో జరుగబోయే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ కు భారతీయ ఓటర్లు భారీ షాక్ ఇవ్వనున్నారా..? ఇప్పటికే అధ్యక్ష రేసులో వెనుకబడిన ఆయనను శాశ్వతంగా ఇంటికి పంపేందుకు అక్కడి ఓటర్లు సిద్ధమవుతున్నారా..? అంటే నిజమేనంటున్నాయి సర్వేలు. భారీ ఆశలు పెట్టుకున్న ఇండో అమెరికన్లు కూడా ట్రంప్ ప్రత్యర్థి జో బైడెన్ కే జై కొట్టనున్నారని ఒక సర్వేలో వెల్లడైంది. దాదాపు 72 శాతం మంది భారతీయ ఓటర్లు.. తాము బైడెన్ కే ఓటు వేస్తామని చెబుతున్నారని ఇండియన్ అమెరికన్ యాటిట్యూడ్స్ (ఐఏఏఎస్) సర్వే తెలిపింది. అమెరికాలోని హ్యాప్కిన్స్ యూనివర్సిటీ నిర్వహించిన ఈ సర్వే లోని ఆసక్తికర అంశాలు కింది విధంగా ఉన్నాయి.

ఐఏఏఎస్ సర్వే ప్రకారం.. ఈసారి అధ్యక్ష ఎన్నికలలో తాము బైడెన్ కే ఓటువేస్తామని 72 శాతం ఇండో అమెరికన్లు తెలిపారు. రిపబ్లికన్ అభ్యర్థి, ప్రస్తుత అధ్యక్షుడు ట్రంప్ కు ఓటు వేస్తామని కేవలం 22 శాతం మంది మాత్రమే చెప్పారు. సెప్టెంబర్ 1 నుంచి 20 మధ్యలో నిర్వహించిన ఈ సర్వేలో.. దాదాపు వేయి మందికి పైగా పాల్గొన్నట్టు అధ్యయనకర్తలు తెలిపారు. అమెరికాలో సుమారు 26 లక్షలకు పైగా ఉన్న ఇండో అమెరికన్లు..మునుపెన్నడూ లేని విధంగా ఈసారి అధ్యక్షఎన్నికలలో కీలక పాత్ర పోషిస్తున్నారు. రాబోయే అధ్యక్ష ఎన్నికల్లో వీరి ఓటు కూడా అధ్యక్ష ఎన్నికను ప్రభావితం చేస్తుందనడంలో ఏమాత్రం సందేహం లేదు.

ఇండో అమెరికన్ల సంఖ్యను గుర్తించిన ట్రంప్ కూడా… వారి ఓట్లను దండుకోవడానికి భారీగానే ప్రణాళికలు వేస్తున్నారు. ఈ క్రమంలోనే హోస్టన్ లో గతేడాది భారత ప్రధాని మోడీతో ‘హౌడీ మోడీ’ నిర్వహించారు. ఇక ఈ ఏడాది ఫిబ్రవరిలో గుజరాత్ లో ‘నమస్తే ట్రంప్’కార్యక్రమాన్ని భారత్ లో మోడీ ప్రభుత్వం నిర్వహించింది. అదీగాక పీఎం మోడీ- ట్రంప్ ల మధ్య కూడా సత్సంబంధాలే ఉన్నాయి. ఈ విషయాన్ని వారిరువురు చాలా సార్లు బహిరంగంగానే వెల్లడించారు.

అయితే కాశ్మీర్, సీఏఏ వంటి అంశాల్లో ట్రంప్ మౌనం వహించగా.. బైడెన్ మాత్రం భారత్ పై విమర్శలు చేశారు. భారత్ చైనా వస్తువులపై బ్యాన్ విధిస్తున్నా.. బైడెన్ మాత్రం చైనాకు వెన్నంటి ఉన్నారని ట్రంప్ పలుమార్లు విమర్శలు కూడా చేశారు. ఇవన్నీ ఇండో అమెరికన్ ఓటర్ల మీద పెద్దగా ప్రభావం చూపలేదని సర్వే ఫలితాలు చూస్తే అర్థమవుతున్నది. అంతేగాక ట్రంప్ తీసుకుంటున్న పలు వివాదాస్పద నిర్ణయాలు భారతీయ అమెరికన్లకు భారీగా ప్రభావితం చేస్తున్నాయి. ఆర్థిక వ్యవస్థ, ఆరోగ్యం, వర్ణ విభేదాలు, ట్యాక్స్ లు, అవినీతి వంటివే గాక వలస విధానం భాగా ప్రభావితం చేస్తున్నది. హెచ్ 1 బీ వీసాల విషయంలో ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలపై అక్కడి భారతీయులు గుర్రుగా ఉన్నారు.

ఏదేమైనప్పటికీ ఇప్పటికే అధ్యక్ష రేసులో ట్రంప్ వెనుకబడ్డారు. అమెరికాలో వస్తున్న సర్వేలు.. ప్రెసిడెన్షియల్ డిబేట్ లో బైడెన్ తో పోల్చితే ఆయన వెనుకబడటం.. ట్రంప్ కు కరోనా తో ప్రచారం చేయకపోవడం అన్నీ ఆయనకు అపశకునాలే కనిపిస్తున్నాయి. మరి ఈ విషమ పరీక్షలను ట్రంప్ దాటుతాడా..! తిరిగి అధ్యక్ష పీఠంపై కూర్చుంటాడా అన్నది కొద్దికాలంలో తెలుస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Shares