ప్చ్… నా పరిస్థితి ఏం బాగోలేదు.. అమెరికాను విడిచిపెట్టి వెళ్లిపోతానేమో : డోనాల్డ్ ట్రంప్
అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష పీఠానికి నవంబరు మొదటివారంలో ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికల్లో ప్రస్తుత అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మరోమారు రిపబ్లికన్ పార్టీ తరపున బరిలోకి దిగుతున్నారు. మరోవైపు, ఆయన ప్రత్యర్థిగా డెమొక్రటిక్ పార్టీ తరపున జో బైడెన్ పోటీలో ఉన్నారు. అయితే, వీరిద్దరి మధ్య ఎన్నికల ప్రచారం హోరాహోరీగా సాగుతోంది. పైగా, ఇప్పటివరకు ప్రచార సరళి ఆధారంగా గెలుపు అవకాశాలు జో బైడెన్‌కే ఎక్కువగా ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి.
అంటే… తన ప్రత్యర్థి జో బైడెన్‌తో పోలిస్తే, వెనుకంజలో ఉన్నారని సర్వేలన్నీ స్పష్టం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో తనకు ఓటమి తప్పదన్న సంకేతాలు అందుకున్న ట్రంప్, బెదిరింపు వ్యాఖ్యలకు దిగడం చర్చనీయాంశమైంది. ఈ ఎన్నికల్లో తాను ఓడిపోతే, అమెరికాను విడిచి వెళ్లిపోతానని, తాజాగా విస్కాన్సిస్‌లో జరిగిన ప్రచార సభలో మాట్లాడుతూ ఆయన చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశం అయ్యాయి.

అమెరికాలో ఇటీవలి కాలంలో జరిగిన పలు ఘటనలు ట్రంప్‌కు వ్యతిరేకంగా మారాయన్న సంగతి తెలిసిందే. వర్ణ వివక్ష, కరోనా కేసులు, మరణాలు, ఆర్థిక పరిస్థితి దిగజారడం, అశాంతి తదితరాలు బైడెన్‌కు అనుకూలంగా మారిన వేళ, “నా పరిస్థితి అంత బాగాలేదు. ఈ ఎన్నికల్లో నేను గెలవకుంటే, ఏం చేస్తానో మీరు ఊహించగలరా? అమెరికాను విడిచి పెట్టి వెళ్లిపోతానేమో… నాకు తెలియడం లేదు” అని ట్రంప్ అన్నారు.

తనకు ప్రత్యర్థిగా ఉన్న బైడెన్ గెలిస్తే, కరోనాకు వ్యాక్సిన్ రావడం మరింత ఆలస్యం అవుతుందని, ఇతర దేశాల్లోనే ముందుగా వ్యాక్సిన్ వచ్చే అవకాశాలు ఉన్నాయని అన్న ట్రంప్, ఆయన కావాలనే వైరస్ వ్యాప్తిని విస్తృతం చేస్తారని ఆరోపించారు. బైడెన్ గెలిస్తే, అమెరికా మూసివేత ఖాయమని, యూఎస్ ప్రజల జీవన విధానం నాశనం అవుతుందని, అందుకు బైడెన్ కుట్రలు పన్నుతున్నారని మండిపడ్డారు. దేశ ప్రజల భవిష్యత్తు ప్రమాదంలో పడకుండా ఉండాలంటే తనను గెలిపించాలని కోరారు.

Share and Enjoy !

0Shares
0 0

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

0Shares
0