H1B కొత్త రూల్స్.. ఎన్నికల స్టంట్: ఇండస్ట్రీ బాడీ.. టెక్కీలకు ఇలా నష్టం!


ఎన్నికలవేళ అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ ఇమ్మిగ్రేషన్ వీసాలపై కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. H1B వీసా విధానాన్ని మరింత కఠినతరం చేశారు. అమెరికన్ల ఉద్యోగాలను రక్షించేందుకు వీసా నిబంధనల్లో మార్పులు చేసినట్లు మూడు రోజుల క్రితం అమెరికా పేర్కొంది. కొత్త ఆంక్షలతో భారత్‌కు చెందిన ఎంతోమంది టెక్కీలపై ప్రతికూల ప్రభావం పడుతుంది. హెచ్1బీ వీసా ద్వారా ప్రతి ఏటా వేలాది మంది భారత్, చైనా సహా వివిధ దేశాల నుండి ఐటీ నిపుణులు అమెరికాలో అడుగు పెడుతున్నారు. అయితే ఈ వీసాలను పలు కంపెనీలు దుర్వినియోగం చేస్తున్నాయని, అమెరికన్లకు రావాల్సిన ఉద్యోగాలను ఇతర దేశాలకు ఇస్తున్నాయని ట్రంప్ ప్రధాన ఆరోపణ. ఈ నేపథ్యంలో వీసాల జారీపై ఆంక్షలు విధిస్తూ డిపార్టుమెంట్ ఆఫ్ హోంలాండ్ సెక్యూరిటీస్ నోటిఫికేషన్ జారీ చేసింది.

కరోనా కట్టడిలో ట్రంప్ విఫలమయ్యారని, ఇలాంటి పరిస్థితుల్లో ఎన్నికలకు ముందు హెచ్1బీ వీసాల పేరుతో ట్రంప్ ఎన్నికల స్టంట్‌కు దిగారనేది పలువురి ఆరోపణ. వీసా విధానంలో మార్పులను నాస్కాం తప్పుబట్టింది. ఈ ఆంక్షలు అమెరికా ఆర్థిక వ్యవస్థపై ప్రతికూలప్రభావం చూపిస్తుందని పేర్కొంది. కరోనా విజృంభణ కారణంగా అమెరికా ఆర్థిక వ్యవస్థ కుదేలవడంతో ఇప్పటికే చాలామంది భారతీయ టెక్కీలు ఉద్యోగాలు కోల్పోయారు. ప్రస్తుత ఆంక్షలతో మరింత మందిపై ప్రభావం పడుతుంది. అమెరికా ప్రతిపక్ష పార్టీతో పాటు ఇండస్ట్రీ బాడీ, ఇమ్మిగ్రేషన్ న్యాయకోవిదులు ట్రంప్ నిర్ణయంపై విమర్శలు గుప్పించారు. ఇది రాజకీయ చర్య అని, కోర్టులో ఇది నిలబడదని పేర్కొన్నారు.

అమెరికాలో 1,400కు పైగా చిన్న, మధ్య తరహా ఐటీ కంపెనీలకు ప్రాతినిథ్యం వహిస్తున్న ఐటీ సర్వ్ అలియన్స్(ITServe) ఈ మధ్యంతర నిర్ణయాలు అనవసరమని అభిప్రాయపడింది. ఇటీవల ఐటీ సర్వ్ ఓ కేసును కూడా గెలిచింది. ఇప్పుడు ట్రంప్ నిర్ణయం కూడా ఓ ఎన్నికల స్టంట్ అని ఐటీ సర్వ్ ప్రతినిధులు పేర్కొన్నారు.

అమెరికా ప్రధానంగా రెండు నిబంధనలు ప్రకటించింది. ఇందులో వేతనాల పెంపుకు సంబంధించినది ఒకటి అయితే, అర్హతల నిబంధనలకు సంబంధించినది రెండోది. స్పెషాలిటీ ఆక్యుపేషన్, యజమాని-ఉద్యోగి సంబంధాలు మొదలైన వాటి నిర్వచనం మారిపోయి పరిధి తగ్గుతుంది. థర్డ్ పార్టీ వర్క్ సైట్ అనే కొత్త నిబంధనను చేర్చారు. వీటి వల్ల హెచ్1బీ కింద ఉన్న ప్రత్యేక నైపుణ్యాల కేటగిరీ కుంచించుకుపోయి, వీసాల సంఖ్యలో కోత పడుతుంది. తాజా నిర్ణయాల వల్ల… ఇన్నాళ్లు వర్క్ సైట్ వద్ద ఉద్యోగులు మూడేళ్ల పాటు పని చేసేందుకు, అవసరమైతే మరో ఏడాది పొడిగించేందుకు అనుమతి ఉంది. ఇప్పుడు దీనిని ఏడాదికి తగ్గించారు. ప్రత్యేక నైపుణ్యాల కేటగిరీకి సంబంధించి అమెరికాలో నైపుణ్యం కలిగిన వారు లభ్యం కాలేదని వివరణ ఇచ్చాక, రూఢీ చేసుకున్నాకే ఇమ్మిగ్రేషన్ అధికారులు హెచ్1బీ వీసా ఇస్తారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Shares